'గతంతో పోలిస్తే త్వరితగతిన స.హ చట్టం కేసుల పరిష్కారం'

22 Dec, 2022 13:34 IST|Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వంలోని కేంద్ర ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌, రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ కమిషన్లతోపాటు ఇన్ఫర్మేషన్‌ అధికారులు, అప్పిలేట్‌ అథారిటీలో సభ్యుల సంఖ్య పెరగనందున కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యంతోపాటు పెండింగ్‌ కేసుల జాబితా పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మౌఖికంగా జవాబిచ్చారు. 

కేసుల పరిష్కారంలో జాప్యం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫర్మేషన్‌ కమిషన్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ ఫైలింగ్‌ ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం జరిగింది. తొలి అపీల్‌, మలి అపీల్, మడో అపీల్‌కు కాలవ్యవధిని నిర్ణయించాం. సమాచార హక్కు చట్టం కింద 24 వేల మంది ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా వార్షిక రిటర్న్స్‌ ఫైలింగ్‌ 92 శాతం దాటింది. గడచిన ఎనిమిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నట్లు రుజువు చేస్తున్నాయని చెప్పారు.

చదవండి: (తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ భారీ జరిమానా) 

మరిన్ని వార్తలు