ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు జాతీయ గుర్తింపు

17 Sep, 2023 04:14 IST|Sakshi

వరించిన ‘టాప్‌ ఎక్స్‌పోర్ట్‌ అవార్డ్‌ ఆఫ్‌ క్యాపెక్సిల్‌’ 

లోక్‌సభాపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ గుర్రంపాటి   

విదేశాలకు ఎర్రచందనం ఎగుమతిలో పురోగతి   

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టాప్‌ ఎక్స్‌పోర్ట్‌ అవార్డ్‌ ఆఫ్‌ క్యాపెక్సిల్‌ అవార్డును సొంతం చేసుకుంది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డికి లోక్‌సభాపతి ఓంబిర్లా ఈ అవార్డును అందజేశారు. అనంతరం దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో పురోగతి సాధించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్‌ కలప ఆధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలతో పాటు బీడీ ఆకు, ఎర్రచందనం వ్యాపారం చేసే ఒక ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు.

ఎకో టూరిజాన్ని కూడా కార్పొరేషన్‌ ప్రొత్సహిస్తోందని తెలిపారు. 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సగటు ఉత్పత్తితో 35 వేల హెక్టార్లలో యూకలిప్టస్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. 6 వేల హెక్టార్లలో జీడి మామిడి, 4 వేల హెక్టార్లలో కాఫీ, మిరియాలు, 2,500 హెక్టార్లలో వెదురు, 825 హెక్టార్లలో టేకు, 1000 హెక్టార్లలో ఇతర వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు.

5,353 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి సుమారు రూ.2 వేల కోట్లు సమీకరించామని, 2023లో ఇప్పటి వరకూ రూ.218 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సాధించామని, మరో రూ.250 కోట్లు సాధించే దిశగా ముందుకెళుతున్నట్టు తెలిపారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి కార్పొరేషన్‌ ‘త్రీస్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌’ హోదాను పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో, ఆయన దిశానిర్దేశంలో కార్పొరేషన్‌ మరిన్ని విజయాలు సాధిస్తుందని  దేవేందర్‌రెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు