తెలుగును పరిరక్షించుకుందాం

30 Aug, 2021 05:58 IST|Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు.

గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్‌ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.  తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు.    ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్‌ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్‌ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు,  కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు