రైతుల ఆందోళనలతో ప్రతికూల ప్రభావమెంత?

15 Sep, 2021 04:46 IST|Sakshi

నాలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు 

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు పారిశ్రామిక, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ, యూపీ, హరియాణా, రాజస్తాన్‌ ప్రభుత్వాలకు, పోలీస్‌ చీఫ్‌లకు కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపింది. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా ప్రొటోకాల్స్‌ ఉల్లంఘన, తదుపరి పరిణామాలు, వివిధ రంగాలపై ఆందోళనల ప్రభావంపై నివేదికలు సమర్పించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, హోంశాఖ, ఆరోగ్య శాఖలను కమిషన్‌ ఆదేశించింది.

రైతు ఆందోళనలపై పలు ఫిర్యాదులు కమిషన్‌కు అందాయని, వీటి కారణంగా దాదాపు 9వేల కంపెనీల యూనిట్లపై ప్రభావం పడిందని తెలిపింది. నిరసనలతో రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని, పేషంట్లు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయని కమిషన్‌ తెలిపింది. మార్గాల మూసివేతతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఇళ్లకు చేరుకోకుండా అడ్డుకున్నారని తెలిపింది. వీటిపై తీసుకున్న చర్యలను నివేదించాలని 4 రాష్ట్రాలను కోరింది. శాంతియుత పద్ధతుల్లో ఆందోళన జరిపే హక్కు అందరికీ ఉందని, కానీ ఈ విషయంలో మానవహక్కుల అంశం ముడిపడి ఉన్నందున జోక్యం చేసుకోవాల్సి వస్తోందని వివరించింది.

రైతు ఆందోళనలతో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలపై, ఉత్పత్తి, రవాణాపై, ఇతర ఇబ్బందులపై సమగ్ర నివేదికను అక్టోబర్‌ 10 నాటికి సమర్పించాలని ఐఈజీ(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌)ను కమిషన్‌ ఆదేశించింది. నిరసన ప్రదేశంలో హక్కుల కార్యకర్త గ్యాంగ్‌ రేప్‌కేసులో పరిహారంపై ఝజ్జర్‌ డీఎం ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని, అక్టోబర్‌ 10 నాటికి తప్పక రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమాలతో సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి ఎదురైన సమస్యల గురించి ఒక సర్వే నిర్వహించి నివేదికనివ్వాలని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ను కమిషన్‌ కోరింది.   

మరిన్ని వార్తలు