ఎన్డీయేలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

31 Jan, 2021 14:42 IST|Sakshi

చిరాగ్‌కు ఆహ్వానంపై  జేడీయూ అభ్యంతరం  

న్యూఢిల్లీ : అధికార ఎన్డీయేలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ భేటీకి లోక్‌ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ చిరాగ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనివెనుక జేడీయూ అభ్యంతరాలే కారణమని భావిస్తున్నారు. కూటమి భావనను మరిచిపోయి, ఎన్నికల్లో తమను వెన్నుపోటు పొడిచిన పార్టీకి తిరిగి ఆహ్వానం పంపడమేంటంటూ జేడీయూ నేతలు బీజేపీపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. బిహార్‌కే చెందిన ఎన్‌డీఏ పక్షాలు హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చా, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీలు కూడా ఎల్‌జేపీకి ఆహ్వానం పంపడం ఏంటంటూ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

దీంతో, ఎల్‌జేపీకి పంపిన ఆహ్వానాన్ని బీజేపీ వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్‌జేపీ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం నితీశ్‌ సారథ్యంలోని జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎల్‌జేపీ అభ్యర్థులను నిలిపింది. తమకు వ్యతిరేకంగా చిరాగ్‌ అభ్యర్థులను బరిలో నిలపడంతో తాము పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయామని జేడీయూ ఆరోపిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని సీఎం నితీష్‌ కుమార్‌ సైతం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎల్‌జేపీ, జేడీయూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 

మరిన్ని వార్తలు