నితీష్‌ కుమారే బీహార్‌ సీఎం: ఎన్డీయే

11 Nov, 2020 20:46 IST|Sakshi

దీపావళి తరువాత ప్రమాణస్వీకారం చేసే అవకాశం

బిహార్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్‌ కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్‌ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్‌ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.  దీపావళి తరువాత నితీష్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు.

నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. నితీష్‌ కుమార్‌ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్‌ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని,  బీహార్‌ నితీష్‌ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్‌ చేశారు.
(చదవండి : నితీష్‌ సీఎం అయితే మాదే క్రెడిట్‌: శివసేన)

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నితీష్‌ కుమార్‌ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్‌ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌మోదీ మాట్లాడుతూ.. బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్‌ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది.

మరిన్ని వార్తలు