బాలిక కడుపులో కిలోన్నర వెంట్రుకల ఉండ.. ఏమైందంటే!

2 Jul, 2021 17:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీఘడ్‌: ఐదేళ్ల బాలిక.. రెండేన్నళ్లుగా తన వెంట్రుకలు తానే తింటోంది.. వద్దని వారించినా వినకపోవడంతో ఎప్పటికప్పుడు జుట్టును కత్తిరించారు కూడా... అయినప్పటికీ అలవాటు మానుకోలేకపోయింది.. ఇంట్లో వాళ్లు తల దువ్వుకుంటున్న సమయంలో రాలి పడిన వెంట్రుకలను తినడం మొదలు పెట్టింది.. ఆఖరికి ఆమె కడుపులో కిలోన్నర పరిణామంలో వెంట్రుకల ఉండ పేరుకుపోగా.. అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్‌ నిర్వహించి వెంట్రుకల ఉండను విజయవంతంగా తొలగించారు. 

ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మౌలీ జాగ్రన్‌కు చెందిన చెందిన బాలికకు పంచకుల సివిల్‌ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ విషయం గురించి సర్జరీ డిపార్టుమెంట్‌ హెడ్‌ డాక్టర్‌ వివేక్‌ భదూ మాట్లాడుతూ... ‘‘వెంట్రుకలు జీర్ణం కావు. ఇవి ఉండలా పేరుకుపోయి.. ఆహారనాళంలో ఉండిపోతాయి. ఈ పరిస్థితిని ట్రైకోబేజర్‌ అంటారు. మానసిక స్థితి సరిగా లేనివారు, తీవ్రంగా ఒత్తిడికి గురయ్యేవారు సాధారణంగా ఇలా వెంట్రుకలు తింటూ ఉంటారు.

అయితే, చిన్న పిల్లల్లో మాత్రం చాలా అరుదుగా ఇలా జరుగుతూ ఉంటుంది. 20 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు. వారం రోజుల క్రితం పాప తల్లిదండ్రులు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో స్కానింగ్‌ చేయగా అసలు విషయం బయటపడింది. తనకు వెంట్రుకలు తినే అలవాటు ఉందని తల్లిదండ్రులు మాకు చెప్పారు. సర్జరీ చేశాం. తనను అబ్జర్వేషన్‌లో ఉంచాం’’ అని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు