జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు 

14 Jan, 2022 13:28 IST|Sakshi

రెండు విడతలుగా నిర్వహణ 

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత 

మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు మలి విడత  

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ సమర్పణ  

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫారసుల మేరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు పార్లమెంటు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 11న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు విరామం ఉంటుంది.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు, పోలింగ్‌ ఉండడంతో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెలువడతాయి. ఫలితాలు వచ్చాక అంటే మార్చి 14 నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 8తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం, ఇటీవల 400 మంది పార్లమెంటు సిబ్బంది కరోనా బారిన పడడంతో పార్లమెంటు నిర్వహణకు పూర్తిస్థాయిలో కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎంపీలు, పార్లమెంటులోకి రావాలనుకునే ఇతరులు రెండు టీకా డోసులు తీసుకున్నట్లు కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌తో పాటు ఆర్‌టీ–పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ సమర్పించాలి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్ట్‌లలో నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ రోజు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు