విపత్కర సమయంలో సేవలందించిన పైలెట్‌కి దిమ్మతిరిగే షాక్‌ !

8 Feb, 2022 15:12 IST|Sakshi

మాములుగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడినప్పుడూ పొరపాటున మన ముందున్న వాహనాన్ని ఢీ కొట్టిన అంత పెద్దమొత్తంలో జరిమాన పడదు. కానీ విమానం ల్యాండింగ్‌ చేసే సమయంలో దేన్నైనా ఢీ కొడితే కళ్లు తిరిగేలా ఎక్కువ మొత్తంలో జరిమాన విధిస్తారు. అచ్చం అలాంటి సంఘటన గాల్వియర్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌ విమానాశ్రయంలో పైలెట్లు కరోనా మహమ్మారీ సమయంలో అపారమైన సేవలందించి కోవిడ్‌ యోధులుగా పేరుతెచుకున్నారు. అలాంటి యోధులలో ఒకడైన పైలెట్‌ మజిద్ అక్తర్ తన కో పైలెట్‌ మే 6, 2021న బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B 250 GT అనే విమానం గాల్వియర్‌ రన్‌వే పై క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యింది. అంతేకాదు కరోనా బాధితులకు సంబంధించిన 71 రెమ్‌డిసివిర్ బాక్స్‌లను అహ్మదాబాద్ నుండి గ్వాలియర్‌కు తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో పైలట్ మాజిద్ అక్తర్, కో-పైలట్ శివ్ జైస్వాల్, నాయబ్ తహసీల్దార్ దిలీప్ ద్వివేది సహా ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కానీ విమానయాన సంస్థ మాత్రం విమానానికి నష్టం కలిగించినందుకు గానూ ఫైలెట్‌ మజిద్ అక్తర్‌కి దాదాపు రూ.85 కోట్ల బిల్లుని కట్టాల్సిందిగా తెలిపింది. అంతేకాదు ఈ విమానాలు దెబ్బతినడం వల్ల ప్రైవేట్‌ ఆపరేటర్ల నుంచి విమానాలను కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ..సుమారు 60 కోట్లు ఖరీదు చేసే ఆ విమానానికి అదనంగా రూ 25 కోట్లు జోడించింది. దీంతో మజిద్  విమానానికి ఇన్సూరెన్స్‌ చేయకుండా ఎలా ఆపరేట్‌ చేయడానికి అనుమతించారని ప్రశ్నించాడు. అంతేకాదు ప్రమాదం ఎలా జరిగిందో కూడా తనకు తెలియదన్నాడు.

అయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) కూడా తనకు ల్యాడింగ్‌ అయ్యేటప్పుడూ ఎటువంటి సూచనలు తెలియజేయాలేదని ఆరోపించాడు. ఈ మేరకు భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ అక్తర్ ఫ్లయింగ్ లైసెన్స్‌ను ఒక ఏడాదిపాటు నిషేధించింది. అంతేకాదు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇన్సూరెన్స్‌ ప్రోటోకాల్‌ని అనుసరించకుండా విమానాన్ని ఎలా అనుమతించారనే దానిపై ప్రభుత్వం మౌనం వహించడం గమనార్హం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ పూర్తైయ్యేవరకు అతని నేరస్తుడిగా పరిగణించకూడదని పేర్కొంది.

(చదవండి: మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి)

మరిన్ని వార్తలు