విచ్ఛిన్న శక్తులను ఏరేద్దాం

25 Oct, 2023 01:54 IST|Sakshi
దసరా వేడుకలో విల్లు ఎక్కుపెట్టిన మోదీ

ఢిల్లీలో దసరా వేడుకల్లో ప్రధాని మోదీ సందేశం 

శ్రీరామ నవమికల్లా అయోధ్యలో రామాలయం పూర్తవుతుందని ప్రకటన

న్యూఢిల్లీ: మత, ప్రాంతీయవాదాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్న విచ్చిన్న శక్తులను తుదముట్టించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా మంగళవారం ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొని అక్కడి వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కేవలం రావణ దిష్టిబొమ్మల దహనానికే పరిమితం కాకుండా, దేశాభివృద్ధిని గాలికొదిలి స్వీయ ప్రయోజనాల సాధనకు తాపత్రయపడే సిద్ధాంతాలనూ దహనం చేయాలని హితవు పలికారు.

విభజన శక్తులపై దేశభక్తి సాధించిన విజయంగా దసరాను జరుపుకోవాలన్నారు. విలక్షణ ఇండియా కూటమిని ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. వివక్ష, సామాజిక రుగ్మతలను నిర్మూలించాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయోధ్యలో రామాలయ వచ్చే రామనవమి నాటికి పూర్తవుతుందని ప్రకటించారు.

శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని చెప్పారు. దసరా సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం పది మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. సామాజికంగా కనీసం ఒక పేద కుటుంబాం పైకి ఎదిగేందుకు చేయూత ఇవ్వాలని హితవు పలికారు. మన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. ‘దసరా నాడు ఆయుధ పూజ జరుగుతుంది. భారత్‌ ఎప్పుడూ ఆయుధాలను స్వీయ రక్షణకే ఉపయోగిస్తుంది‘ అని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు