జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ.. దిల్‌ కీ దూరీ’ వద్దు

25 Jun, 2021 03:43 IST|Sakshi
అఖిలపక్ష భేటీ సందర్భంగా కశ్మీర్‌ నేతలతో ప్రధాని మోదీ. చిత్రంలో ముందు వరసలో (ఎడమ నుంచి) జితేంద్ర సింగ్, మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా, అమిత్‌ షా, మోదీ, గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఆజాద్, ఒమర్‌ అబ్దుల్లా, కవీందర్‌ గుప్తా

నియోజకవర్గాల పునర్విభజన తరువాతే ఎన్నికలు

జమ్మూకశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం

యువతకు రాజకీయ నాయకత్వం లభించాలి

ప్రజాస్వామ్యం బలోపేతమవ్వాలి

కశ్మీర్‌ ముఖ్య నాయకులతో ప్రత్యేక భేటీలో ప్రధాని మోదీ

రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యావశ్యకం

అదే ప్రధానికి చెప్పాం; వారు అందుకు హామీ ఇచ్చారు

ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలన్నాం

జేకే నాయకుల స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన తరువాత మాత్రమే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని అక్కడి అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం మళ్లీ చూరగొనేందుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యంత కీలకమని అఖిలపక్ష నేతలు ప్రధానికి తేల్చి చెప్పారు. 2019 ఆగస్ట్‌లో తొలగించిన రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని సమావేశంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన అందరు నేతలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ నేత ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామిక ప్రక్రియను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారని అధికార వర్గాలు వెల్లడించాయి.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019 ఆగస్ట్‌ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం.. అక్కడి కీలక నేతలతో మోదీ సమావేశమవడం ఇదే ప్రథమం. జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను నిర్వహించిన తీరుగానే అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యమని తాము భావిస్తున్నామని, అయితే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరమే ఎన్నికలు ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతో మెజారిటీ నాయకులు ఏకీభవించారని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ’, ‘దిల్‌ కీ దూరీ (ఢిల్లీతో అంతరాన్ని, మనసుల మధ్య దూరాలను)లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సమావేశం సానుకూల, సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ప్రజాస్వామ్యం కోసం పని చేయాలని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను ఘర్షణాత్మక ప్రాంతంగా కాకుండా, శాంతియుత ప్రాంతంగా నెలకొల్పేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని బేగ్‌ తెలిపారు. నాయకులందరి  అభిప్రాయాలను ప్రధాని సావధానంగా విన్నారన్నారు.

జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర సీఎంలుగా పనిచేసిన నలుగురు నాయకులు ఫరూఖ్‌ అబ్దుల్లా(ఎన్సీ), ఒమర్‌ అబ్దుల్లా(ఎన్సీ), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), గులాం నబీ ఆజాద్‌(కాంగ్రెస్‌).. ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన  తారాచంద్‌(కాంగ్రెస్‌), ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ (పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌), నిర్మల్‌ సింగ్‌ (బీజేపీ), కవీందర్‌ గుప్తా (బీజేపీ) ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగమి (సీపీఎం), అల్తాఫ్‌ బుఖారీ (జేకేఏపీ), సజ్జాద్‌ లోన్‌ (పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌), జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ జీఏ మిర్, రవిందర్‌ రైనా (బీజేపీ), భీమ్‌ సింగ్‌ (పాంథర్‌ పార్టీ) కూడా ప్రధానితో సమావేశమైన వారిలో ఉన్నారు. హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ హాజరయ్యారు.  

ఎన్నికల నిర్వహణ కీలకం: షా
రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటు శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడం అత్యంత ముఖ్యమైన మైలురాళ్లని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ‘జమ్మూకశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సమావేశంలో జమ్మూకశ్మీర్‌ భవిష్యత్తుపై చర్చించాం. పార్లమెంట్లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే.. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు శాంతియుత ఎన్నికల నిర్వహణ చాలా కీలకం. జమ్మూకశ్మీర్‌ నేతలతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని నాయకులంతా స్పష్టం చేశారు’ అని షా ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే: ఫరూఖ్‌  
జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో మళ్లీ విశ్వాసం పాదుకొనాలంటే రాష్ట్ర హోదాను పునరుద్దరించడం చాలా ముఖ్యమని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పి ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ప్రజల్లో నమ్మకం పోయింది. దాన్ని మళ్లీ పొందాలంటే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించాలి. ఐఏఎస్, ఐపీఎస్‌ కేడర్లను పునరుద్ధరించాలి. జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా మారాలి. రాష్ట్ర ఆస్తిత్వ గుర్తింపు చాలా అవసరం. ఈ విషయాన్నే ప్రధానికి స్పష్టంగా చెప్పాం’ అన్నారు.

అస్సాంకు, మాకు మాత్రమే తేడా ఎందుకు?: ఒమర్‌
జమ్మూకశ్మీర్‌ విషయంలో ‘దిల్లీ కీ దూరీ.. దిల్‌ కీ దూరీ’ని తొలగించాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, షా తెలిపారన్నారు. ‘దిల్లీ కీ దూరీ.. దిల్‌ కీ దూరీని తొలగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. అయితే, అది ఒక్క సమావేశంతోనే సాధ్యం కాదని నాతో పాటు ఇతర నాయకులు ఆయనకు చెప్పాం’ అన్నారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ నివేదిక ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందన్నారు. అస్సాంకు, జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించామన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో భాగం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించామన్నారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ను నిలిపేసి అస్సాంలో ఎన్నికలు నిర్వహించినట్లుగా, జమ్మూకశ్మీర్లోనూ నిర్వహించాలని కోరామన్నారు. అధికారులతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కేంద్రం కూడా భావిస్తోందన్నారు.

పార్టీ తరఫున మాట్లాడాం: ఆజాద్‌
ప్రధానితో భేటీలో పార్టీ తరఫున పలు అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. ‘ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కశ్మీరీ పండిట్లకు పునరావాస ప్రక్రియ, రాజకీయ ఖైదీల విడుదల, జమ్మూకశ్మీర్‌ యువతకు ఉద్యోగాల కల్పన కోసం స్థానికత నిబంధనలు..  మొదలైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం’ అని వివరించారు.  

370 రద్దుపై పోరాటం ఆగదు: ముప్తీ
ప్రధాని నరేంద్ర మోదీతో అఖిలపక్షం భేటీ బాగా జరిగిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో అనధికార చర్చల ద్వారా నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి, చొరబాట్ల తగ్గుదలకు కారణమైనందున ప్రధాని మోదీకి అభినందనలు తెలిపామన్నారు. ‘రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు, అవసరమైతే, చర్చలను పునరుద్ధరించాలని ప్రధానిని కోరాం. నియంత్రణ రేఖ ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశాం’ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ‘మాకు ప్రత్యేక హోదా పాకిస్తానేం ఇవ్వలేదు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్ల ప్రత్యేక హోదా వచ్చింది. దాన్ని పునరుద్ధరించుకునేందుకు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం’ అని మెహబూబా స్పష్టం చేశారు.  

పునర్విభజన త్వరగా జరగాలి: పీఎం మోదీ
జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన త్వరగా జరగాలని, తద్వారా త్వరగా ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపడం కీలకమైన ముందడుగు అని కశ్మీర్‌ నేతలతో భేటీ అనంతరం ట్వీట్‌ చేశారు. విభిన్న అభిప్రాయాలున్న వారు కూర్చుని చర్చలు జరపడం భారతీయ ప్రజాస్వామ్యంలోని బలమన్నారు. జమ్మూకశ్మీర్లో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. కశ్మీర్‌ ప్రజలకు, ముఖ్యంగా యువతకు రాజకీయ నాయకత్వం లభించాల్సిన, వారి ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉందని అక్కడి నాయకులతో చెప్పానన్నారు. జమ్మూ కశ్మీర్‌తో ఉన్న ‘దిల్లీ కీ దూరీ.. దిల్‌ కీ దూరీ’ని తొలగించాలన్నది తన ఆకాంక్ష అని జేకే నాయకులతో ప్రధాని మోదీ పేర్కొన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్లో ఒక్క మరణం సంభవించినా.. అది బాధాకరమేనని, కశ్మీరీ యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని ప్రధాని వారితో చెప్పారని వివరించాయి. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా.. జమ్మూకశ్మీర్‌ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరం కలసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారని తెలిపాయి.

మరిన్ని వార్తలు