నూతన పార్లమెంట్‌ దేశ ప్రజలకు గర్వకారణం: మోదీ

10 Dec, 2020 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్‌ భవనం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత భవనం భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతనంగా అన్ని వసతులతో నిర్మించనున్న పార్లమెంట్‌ భవనానికి ప్రధాని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు హాజరయ్యారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్ధేశిస్తూ మీడియాతో మాట్లాడారు.. ‘‘అంబేడ్కర్‌ వంటి మహనీయులు సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ రచన చేశారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. (  నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్‌ )

నూతన భవనంలో అనేక సౌకర్యాలు రానున్నాయి. కొత్త భవనం ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుత భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించింది. నూతన భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశానిర్దేశం చేయనుంద’’ని అన్నారు. కాగా, నూతన పార్లమెంట్‌ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.971 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా దీని నిర్మాణం జరగనుంది. 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మరిన్ని వార్తలు