పెట్రోల్‌లో 20% ఇథనాల్‌!

6 Jun, 2021 04:44 IST|Sakshi

2025 కల్లా అమలయ్యేలా చర్యలు

బయో ఇంధనమైన ఇథనాల్‌ వాడకంతో రైతులకూ పరోక్షంగా లబ్ధి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌ 2020–25’ను ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ: కాలుష్యకారక కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు విదేశాల నుంచి చమురు దిగుమతుల తగ్గింపే లక్ష్యంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ ముందడుగు వేసింది. ప్రతీ లీటర్‌ ఇథపెట్రోల్‌లో నాల్‌ మిశ్రమ పరిమాణాన్ని 20 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ‘ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌ 2020–25’ను శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

చెరకు నుంచి ఇథనాల్‌ను తయారుచేస్తారు. పాడైపోయిన గోధుమలు, నూక(విరిగిన బియ్యం)లు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను భారీ మొత్తంలో ఉత్పత్తిచేయొచ్చు. బయో ఇంథనమైన ఇథనాల్‌ వాటాను లీటర్‌ పెట్రోల్‌లో 20 శాతానికి పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని భారీ మొత్తంలో తగ్గించవచ్చు. ఇథనాల్‌ వాడకం పెరగడంతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్‌ ఆధారపడటమూ  తగ్గనుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచే ఇథనాల్‌ ఉత్పత్తి సాధ్యం కనుక రైతులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారనుంది.

సమీకరణకు రూ.21వేల కోట్లు
వచ్చే ఏడాదికల్లా 10 శాతం కలపాలని, 2030కల్లా 20% కలపాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. 2014లో పెట్రోల్‌లో 1–1.5 శాతం ఇథనాల్‌ కలిపేవారు. ప్రస్తుతం ఇది 8.5 శాతానికి చేరింది. గతంలో 39 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కేంద్రం సమీకరించగా ప్రస్తుతం 320 కోట్ల లీటర్లను సమీకరిస్తోంది. గత ఏడాది ఇథనాల్‌ సమీకరణ కోసం చమురు సంస్థలు రూ.21వేల కోట్లు ఖర్చు చేశాయి. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉంది. దేశీయ డిమాండ్‌లో 85% చమురు విదేశాల నుంచే వస్తోంది.  10% ఇథనాల్‌ కలపాలంటే భారత్‌ 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను సమీకరించాల్సిఉంటుంది.

అంతకుముందే లక్ష్యాన్ని సాధించాలి
‘పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ వాటా అనే లక్ష్యాన్ని 2030 ఏడాదికల్లా సాధించాలని గతంలో అనుకున్నాం. కానీ, అంతకుముందే(2025కల్లా) సాధించాలనేది మా ఆకాంక్ష. ఇథనాల్‌ వినియో గం పెరిగితే అది పర్యావరణానికీ మంచిదే. రైతుల ఆదాయం పెరిగి వారి జీవితాలు మెరుగు పడతాయి. పర్యావరణ సమతుల్యత కోసం భారత్‌ అంతర్జాతీయంగా పోరాడుతోంది. భారత పునరుత్పాదక ఇంథన సామర్థ్యం 250 శాతం పెరిగింది. ఈ విభాగంలో భారత్‌ ప్రపంచంలో టాప్‌–5లో నిలిచింది. భారత సౌర శక్తి సామర్థ్యం గత ఆరేళ్లలో 15 రెట్లు పెరిగింది. గృహాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు 37 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు, 23 లక్షల ఎనర్జీ ఎఫీషియన్సీ ఫ్యాన్‌లు, వంట గ్యాస్‌ను అందించాం’అని రోడ్‌మ్యాప్‌ ఆవిష్కరణ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రైతులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు