Madhya Pradesh: పోస్టల్‌ బ్యాలెట్‌ వివాదం.. నోడల్‌ అధికారి సస్పెన్షన్‌

28 Nov, 2023 20:39 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ వివాదానికి సంబంధించి నోడల్‌ అధికారిని ఎలక్షన్‌ కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. బాలాఘాట్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్‌లను తెరిచినందుకు సంబంధించి పోస్టల్ నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ మంగళవారం తెలిపారు.  సస్పెండ్ అయిన అధికారిని తహసీల్దార్ హిమ్మత్ సింగ్‌గా గుర్తించారు.

‘బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్రమబద్ధీకరించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఇది జరిగింది. సమయానికి ముందే బ్యాలెట్ బాక్స్ తెరవడంలో విధానపరమైన లోపం సంభవించింది. దీనికి బాధ్యుడైన పోస్టల్ నోడల్ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది’ అని ఎన్నికల ప్రధాన అధికారి రాజన్ చెప్పారు. 

ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ఓటు వేయడానికి అనుమతించడం లేదన్న రాజకీయ పార్టీల ఆరోపణపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో సుమారు 3.23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఈవో రాజన్‌ తెలిపారు. డిసెంబరు 3న రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు