-

నేడూ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం 

28 Nov, 2023 01:25 IST|Sakshi

సీఈఓ వికాస్‌రాజ్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ విధుల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడానికి తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని సంప్రదిస్తే, వారికి  మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌  జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించలేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సదరు ఉద్యోగి పేరుతో ఇంతకుముందు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ కాలేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేసి, ఓట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటేసేందుకు అనుమతించాలని సీఈఓ తెలిపారు. ఒకవేళ ఉద్యోగి పేరుతో అప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ అయితే మళ్లీ కొత్త పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయరాదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఏ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారికి చేరిందో తెలియజేయాలని సూచించారు.

ఉద్యోగిని ఎన్నికల విధుల కోసం అదే జిల్లాకు కేటాయించినా, ఇతర జిల్లాకు కేటాయించినా ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్‌ ఓటు వేసేందుకు డ్యూటీ ఆర్డర్‌ కాపీతో తమ ఓటు ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిని కలవాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయమై ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఈఓకు విన్నవించాయి. బండి సంజయ్‌ కూడా ఈసీకి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు