సీవీసీగా ప్రవీణ్‌ శ్రీవాస్తవ

30 May, 2023 05:13 IST|Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది.

సీవీసీ సురేశ్‌ ఎన్‌ పటేల్‌ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు. సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 బ్యాచ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అయిన శ్రీవాస్తవ అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. గత ఏడాది జనవరి 31న కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. సీవీసీ సారథ్యంలో విజిలెన్స్‌ కమిషన్‌లో గరిష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు. ఐబీ మాజీ చీఫ్‌ అర్వింద్‌ ఒక్కరే  ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్నారు. మరో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది.

మరిన్ని వార్తలు