మనీలాండరింగ్‌ కేసు: ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

28 Dec, 2023 12:22 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్‌ఆర్‌ఐకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది.

వివరాల ప్రకారం.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదే విధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి(యూఏఈ), సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించింది. 

ఇక, రాబర్ట్ వాద్రాతోపాటు సంజయ్ భండారీ సన్నిహితులు తంపి, సుమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ వీరిరువురిని అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను సీసీ థంపి రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్‌తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండు ఆస్తుల్ని నేరపూరితంగా వచ్చిన ఆదాయం నుంచి పొందారు. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ రెండు ఆస్తులు మనీ లాండరింగ్, 2002 నిబంధనల ప్రకారం నేరం ద్వారా వచ్చిన ఆదాయం నుండి పొందబడ్డాయని తెలిపింది. 

>
మరిన్ని వార్తలు