టీపీసీసీ చీఫ్‌ ఎంపిక దాదాపు పూర్తి!

25 Dec, 2020 01:13 IST|Sakshi

ఢిల్లీలో కొనసాగుతున్న సమాలోచనలు..

రాహుల్‌ పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ 

భంగపడ్డ నేతలకు పదవులిచ్చి బుజ్జగించే ప్రయత్నం..

జనవరి 1 నుంచి పార్టీ బలోపేతానికి యాక్షన్‌ ప్లాన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌కుమార్‌ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను ఏఐసీసీ దాదాపు పూర్తి చేసింది. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ మరికొద్ది రోజులు సాగనుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సుమారు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ల బృందం అధిష్టానానికి తమ నివేదికను సమర్పించింది. అయితే గత రెండ్రోజులుగా ఠాగూర్‌ సమర్పించిన ఆశావహుల జాబితా నివేదికపై ఏఐసీసీ స్థాయిలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి.

పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసన్‌లు రెండుసార్లు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఇతర రాజకీయపక్షాలకు ధీటుగా పార్టీని నడిపించగల సామర్థ్యం ఉన్న వారినే నియమించాలని ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ కీలక నేత తెలిపారు. మరోవైపు ఈ విషయంపై చర్చించేందుకు అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇప్పటికే అనేకసార్లు భేటీ అయ్యారు.  చదవండి: (వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం)

అసంతృప్తి తగ్గించడం ఎలా..? 
అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయిలో లేదా ఏఐసీసీ స్థాయిలో మెరుగైన పదవులు కట్టబెట్టడం ద్వారా అసంతృప్తి తగ్గించవచ్చని పెద్దలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాహుల్‌ గాంధీ స్వయం గా ఆశావహులతో మాట్లాడిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటారని, శని, ఆదివారాల్లో ఆయన వారితో మాట్లాడుతారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే టీపీసీసీ చీఫ్‌ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం.  చదవండి: (బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా)

పార్టీ బలోపేతంపై దృష్టి.. 
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌పై వచ్చిన వ్యతిరేకతను బీజేపీ కంటే ముందే తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది. అందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 2021 జనవరి 1 నుంచి కొత్త యాక్షన్‌ ప్లాన్‌తో రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత మండల స్థాయి అ«ధ్యక్షుల నియామకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేదా కొత్త అధ్యక్షులను నియమించాలా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయ్యాక జిల్లా స్థాయి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరుగుతాయని తెలిసింది.

పీసీసీ కమిటీల్లో భారీ కోతలు.. 
ప్రస్తు తం భారీగా ఉన్న పీసీసీ కమిటీలో కోతలు ఉండే అవకాశం ఉంది. 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా సెక్రటరీలు, జాయింట్‌ సెక్రటరీలు, 27 మం ది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను కుదించనున్నారు. జిల్లా స్థాయి లో ఓ అధికార ప్రతినిధి, పీసీసీ స్థాయిలో 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను కొత్త కమిటీలో నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది.  

మరిన్ని వార్తలు