చైనా ఆగడాలు, ఆర్థిక మాంద్యంపై దృష్టి పెట్టిన విపక్షం

8 Sep, 2020 17:26 IST|Sakshi

11 ఆర్డినెన్స్‌లలో నాలుగింటిని పూర్తిగా తిరస్కరించాలని నిర్ణయం

జీరో అవర్‌ కాలపరిమితి పెంపుకై డిమాండ్‌

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ సమావేశం జరిగింది. సెప్టెంబర్‌ 14న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన సమస్యల గురించి నేడు చర్చించారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టబోతున్న 11 ఆర్డినెన్స్‌లలో నాలుగింటిని పూర్తిగా తిరస్కరించాలని నిర్ణయించారు. అంతేకాక జీరో అవర్‌ను ఎక్కువ కాల పరిమితిని పెంచాలని డిమాండ్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆగస్టు 24 వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత తొలిసారిగా సోనియా, రాహుల్ గాంధీలను ఎదుర్కొన్న అసమ్మతివాదులు, నేటి నిర్ణయాలతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక గత ఐదు నెలల్లో సోనియా గాంధీ కరోనాతో సహా పలు సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ఏడు లేఖలు రాశారు. ఇక రాహుల్‌ గాంధీ కూడా కరోనా నియంత్రణ చర్యలు, ఆర్థిక మాంధ్యం, లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల గురించి ప్రతి రోజు కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌కు ఇది కర్తవ్యమే!)

నేడు సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ చైనా దురాక్రమణ, ఆర్థికమాంద్యం అంశాల గురించి ప్రస్తావిస్తూ.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశాల్లో మోదీ నిర్ణయాలు టైటానిక్‌ మాదిరిగానే దేశాన్ని ముంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక మీడియా, మోదీ ఈ సమస్యలను దాచే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వం ఇయర్‌ ప్లగ్స్‌ ధరించిన వ్యక్తి మాదిరి ప్రవర్తిసుందన్నారు. ‘మోదీ తనకు రుచించని సమస్యలను వినదల్చుకోవడం లేదు. కానీ భవిష్యత్తులో ఇవి అకస్మాత్తుగా తెరపైకి వచ్చి.. దేశాన్ని కకావికలం చేస్తాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మంచు కొండను తాకి విరిగిపోయిన టైటానిక్‌ మాదిరిగా తయారవుతుంది’ అన్నారు రాహుల్‌ గాంధీ. నేటి సమావేశానికి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు మనీష్ తివారీ హాజరయ్యారు. నేటి సమావేశంతో వారు సంతోషంగా ఉన్నారని.. పార్టీ చర్చలు "సరైనవి", "పరిణతి చెందినవి" అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు