ముందు క్షమాపణ చెప్పి.. ఆ తర్వాతే మాట్లాడు!: బీజేపీ

17 Mar, 2023 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన పార్టీల సభ్యుల ఆందోళనలతో వరుసగా రెండోరోజూ కూడా ఉభయ సభల నిర్వాహణ కష్టతరంగా మారింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసంగించేందుకు అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. 

ఒకవైపు రాహుల్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలు కోరుతోంది. మరోవైపు అదానీ-హిడెన్‌బర్గ్‌ అంశంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతపతిక్షాలు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కూడా బీజేపీ-కాంగ్రెస్‌ నినాదాల నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

కిందటి రోజు మైకులను ఆఫ్‌ చేశారు. ఇవాళ ఏమో ఏకంగా సభలనే నడవకుండా చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడి(అదానీని ఉద్దేశిస్తూ..) పార్లమెంట్‌నే మూగబోయేలా చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ తన ట్విటర్‌ పేజీలో ట్వీట్‌ చేసింది. 

తనను మాట్లాడనిస్తే తన లండన్‌ ప్రసంగంపై వివరణ ఇస్తానంటూ రాహుల్‌ గాంధీ చెప్తుండగా..  మరోవైపు ముందు జాతికి  క్షమాపణ చెబితే రాహుల్‌ గాంధీని మాట్లాడేందుకు అనుమతిస్తామని చెబుతోంది. ఈ తరుణంలో పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్‌ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. 

బ్రిటన్‌ లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు