హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్‌

5 Aug, 2022 14:08 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనల్లో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్‌ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది.

నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత నియంత పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కనుమరుగైందని, ఆర్‌ఎస్ఎస్‌ దేశాన్ని నియంత్రిస్తోందని ఆరోపించారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లోని నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
చదవండి: అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు