పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సింది: రాజ్‌నాథ్‌ సింగ్‌

26 Sep, 2022 21:16 IST|Sakshi

సిమ్లా: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో 1971లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్. ‘1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’  అని పేర్కొన్నారు రాజ్‌నాథ్‌. అనంతరం హమిర్‌పుర్‌ జిల్లాలోని నదౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. 

గతంలో భారత్‌ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్‌ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్‌నాథ్‌. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్‌ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. 

పాకిస్థాన్‌ అక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్‍నాథ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్‌  ఆక్రమణలో ఉన్నప్పటికీ  పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు.

ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ

మరిన్ని వార్తలు