‘కారు’ బేకార్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

17 Oct, 2023 04:17 IST|Sakshi

జమ్మికుంట, మహేశ్వరం సభల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ధ్వజం

బీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశమిచ్చినా అభివృద్ధి జరగలేదు 

కేసీఆర్‌ తన కుటుంబానికే అధిక ప్రాధాన్యమిచ్చారు 

దళితులు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శ 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టీకరణ 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రాష్ట్రంలో కారు బేకార్‌ అయ్యిందని, ప్రజలు రెండుసార్లు అవకాశమిచ్చినా కేసీఆర్‌ తన కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు తప్ప.. ప్రజలు, నిరుద్యోగులు, దళితుల ఆకాంక్షలు నెరవేర్చలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా మారిందని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతిలో చిత్తుకావాల్సిందేనన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లో ‘జనగర్జన’పేరిట బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. 

కేంద్ర పథకాలను కేసీఆర్‌ అమలు చేయట్లేదు 
కేంద్ర పథకాలను కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేయడంలేదని రాజ్‌నాథ్‌ విమర్శించారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే పీఎంఏవై పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంఏవై కింద దాదాపు 4 కోట్ల మందికి సొంతింటి కల నిజం చేసినట్లు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ప్రజల చేతిని ఏనాడో వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చి న హామీలు నెరవేర్చలేదని, ఉద్యోగ ఖాళీలు ఉన్నా ఎందుకు భర్తీ చేయట్లేదో యువతకు సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఏ పరీక్ష జరిగినా పేపర్లు లీకవుతున్నాయని విమర్శించారు. దళితులకు ఇచ్చిన మాట కూడా కేసీఆర్‌ నిలబెట్టుకోలేదన్నారు.  

‘లక్ష్మి’..‘చేయి’ ఊపితేనో, ‘కారు’లోనో రాదు.. 
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చెప్పింది చేస్తుందని.. గుజరాత్‌ అభివృద్ధిలో దేశానికే మోడల్‌ అయ్యిందని పేర్కొన్నారు. 27 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ‘తెలంగాణకు కేంద్రం అనేక నిధులు మంజూరు చేసింది. అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేసింది. మూడు వందే భారత్‌ రైళ్లు మంజూరు చేసింది. కరోనా వంటి కష్టకాలంలోనూ దేశాన్ని అగ్రగామిగా నిలిపింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు కూడా పంపిణీ చేసింది. దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చింది..’అని గుర్తు చేశారు.

జనవరి 24 నుంచి అయోధ్యలో రామాలయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏ ఒక్కరి పోరాట ఫలితంగానో ఏర్పడలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ వెనుకబాటుకు నాడు కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు. ‘లక్ష్మి’.. ‘చేయి’ఊపితేనో..‘కారు’లోనో రాదు. కమలం వికసిస్తేనే వస్తుంది. కమలం గుర్తుకు ఓటేసి ‘లక్ష్మి’ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆవసరముందని వ్యాఖ్యానించారు. 

బీజేపీని ఆశీర్వదించండి: రాజేందర్‌ 
బీజేపీ–తెలంగాణ బంధం ఈనాటిది కాదని, 1997లో కాకినాడలో తెలంగాణకు అనుకూలంగా పార్టీ తీర్మానం చేసిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ప్రధాన మోదీ అని, తెలంగాణలో బీజేపీని ఆశీర్వదిస్తే కిలో కూడా తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ఉద్యోగాల భర్తీ చేపడతామని, ప్రజలకు ఉచిత విద్య–వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్, పార్టీ నేత ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

బీఆర్‌ఎస్,కాంగ్రెస్‌లను సాగనంపండి: కిషన్‌రెడ్డి 
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలను సాగనంపి రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి..’అని విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మజ్లిస్‌ పార్టీ చేతిలో పెట్టేందుకు కేసీఆర్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆపార్టీని కాంగ్రెస్‌ పెంచి పోషించిందని విమర్శించారు. మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు.   

మరిన్ని వార్తలు