అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్‌ క్లారిటీ

22 May, 2023 14:52 IST|Sakshi

న్యూఢిల్లీ: గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు తీవ్రంగా నగదు కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు డిజిటెల్‌ లావాదేవీలకు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో 100,500, 2000 నోట్లతోనూ లావాదేవీలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్న ఆర్బీఐ ప్రకటించింది. దీంతో నోట్ల రద్దు అంశానికి సంబంధించి పలు రకాల వార్తలు వినపడుతున్నాయి. తాజాగా కేంద్ర బ్యాంకులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్..నోట్ల రద్దు అంశంపై పలు విషయాలను వెల్లడించారు.

2వేల నోట్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో.. 2వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించిన నేప‌థ్యంలో.. ఆ వ‌త్తిడిని త‌ట్టుకునేందుకు రూ.1000 నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా అని ప్ర‌శ్నించారు. అందుకు శక్తికాంత్‌ దాస్‌ బదులిస్తూ.. రూ.1000 నోటును పున ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేదన్నారు. అది ఊహాజ‌నితమేనని, అలాంటి ప్ర‌తిపాద‌నే లేద‌ని స్పష్టం చేశారు. వీటితో పాటు అకస్మికంగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.

నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగమేనని, క్లీన్‌ నోట్‌ పాలసీ అనే ప్రక్రియ ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. ప్ర‌స్తుతం చలామణిలో ఉన్న క‌రెన్సీలో 2 వేల నోట్ల విలువ కేవ‌లం 10.8 శాతం మాత్ర‌మే అని, కనుక ప్రస్తుత ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై చాలా స్వ‌ల్ప స్థాయిలో ప్ర‌భావం ఉంటుంద‌న్నారు. రూ. 2,000 నోటు నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన ఆర్బీఐ.. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరిత పద్ధతిలో తీర్చేందుకు రూ.2000 నోటు చలామణిలోకి తీసుకొచ్చింది.

చదవండి: విచిత్రం.. కేరళలో కిలో మీటర్‌ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు