కరోనా అదుపు.. మందుబాబుల జోరు.. గరిష్ట స్థాయిలో అమ్మకాలు

25 Apr, 2022 16:00 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో, మూడో దశ కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాగానే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఏకంగా 23.58 కోట్ల లీటర్ల విదేశీ మద్యం, 34.83 కోట్ల లీటర్ల దేశీ మద్యాన్ని, అలాగే 23.13 లక్షల లీటర్ల బీరు, 0.86 లక్షల లీటర్ల వైను సేవించినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ వద్ద నమోదైన వివరాలను బట్టి తెలిసింది. 2020 మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వైన్‌ షాపులు, బార్లు పూర్తిగా మూసి ఉన్నాయి. ఆ తరువాత దశలవారీగా లాక్‌డౌన్‌ నియమాలు సడలించడంతో సమయపాలన పాటి స్తూ అప్పుడప్పుడు వైన్‌ షాపులు తెరిచి ఉండేవి.

కాని ఈ ఏడాది జనవరి నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో మద్యం విక్రయాలు మరింత జోరందుకున్నాయి. విదేశీ మద్యంతో పోలిస్తే బీర్ల విక్రయం కొంతమేర తగ్గింది. కాని గత పదేళ్లతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో మద్యం విక్రయాలు పెరిగాయని రికార్డులను బట్టి స్పష్టమైతోంది. 2012–13 ఆర్ధిక సంవత్సరంలో 80.55 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోగా రూ.9,297 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2021–22 ఆర్ధిక సంవత్సరంలో 82.4 కోట్ల లీటర్ల మద్యం విక్రయం కాగా రూ.17,177  కోట్ల ఆదాయం వచ్చినట్లు రాష్ట్ర ఆదాయ పన్ను వద్ద నమోదైన రికార్డులను బట్టి తెలిసింది.

చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం..
మద్యం విక్రయాలతో పాటు బార్లు, వైన్‌ షాపుల లైసెన్స్‌ రిన్యూవల్, కొత్త లైసెన్స్‌లు జారీ, మద్యం స్మగ్లింగ్‌ లపై చేసిన దాడులు,  పన్నులు తదితరాల వల్ల వచ్చిన ఆదాయం కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో మద్యం స్మగ్లింగ్, అక్రమంగా మద్యం తయారుచేయడం, అనుమతి లేకుండా విక్రయించడం తది తరా కారణాలవల్ల పట్టుబడ్డ  34,849 మందికి పోలీసులు బేడీలు వేశారు. పదేళ్లతో పోలీస్తే ఇంతపెద్ద సంఖ్యలో నింధితులు పట్టుబడడం ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు