పాంచ్‌ పటాకా: రూ.331 కోట్ల సంపద సీజ్‌

17 Mar, 2021 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాయిలాలుగా అందిస్తున్న డబ్బులు, ఆభరణాలు, సామగ్రి, పరికరాలు, బహుమతులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈసారి ఎప్పుడు లేనంతగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా సంపదను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం
పుదుచ్చేరిల్లో విచ్చలవిడిగా డబ్బుతో పాటు ఇతర తాయిలాలు తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో భారీగా సంపద లభిస్తోంది.

2016తో పోలిస్తే ఇప్పటివరకు పట్టుబడిన సంపద రెట్టింపులో ఉందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుబడ్డ సంపద విలువ అక్షరాల
రూ.331.47 కోట్లు. అయితే గతంలో 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సంపద రూ.225.17 కోట్లు. ఎన్నికల ప్రారంభంలోనే ఇంత నగదు పట్టుబడగా ఎన్నికలు ముగిసే నాటికి ఎంత డబ్బు
పట్టుబడుతుందోనని అధికార వర్గాలతో పాటు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ సంపదను ఎన్నికల సంఘం రాష్ట్రాలవారీగా వర్గీకరించింది.

  • తమిళనాడు రూ.127 కోట్లు
  • పశ్చిమ బెంగాల్‌ రూ.112.59 కోట్లు
  • అస్సాం రూ.63 కోట్లు
  • కేరళ రూ.21.77 కోట్లు
  • పుదుచ్చేరి రూ.5.72 కోట్లు

ఈ పట్టుబడ్డ సంపదలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా అసోం చివరి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 295 మందిని వ్యయ పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఈ పరిశీలకులు పని చేయనున్నారు. ఓటర్లకు ఎరగా డబ్బు, ఆభరణాలు, బహుమతులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. అందుకోసం ఎన్నికల సంఘం తాయిలాల పంపకాన్ని అడ్డుకుంటోంది.

చదవండి: అధికారంలోకి వస్తే ‘అమ్మ మృతి’ మిస్టరీ చేధిస్తాం
చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్‌

మరిన్ని వార్తలు