విరాళాల వివరాలివ్వండి

3 Nov, 2023 05:18 IST|Sakshi

రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాలపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఎలక్టోరల్‌ బాండ్ల చట్టబద్ధత కేసులో వాదనలు పూర్తి

తీర్పును రిజర్వ్‌చేసిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్‌ కవర్‌లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది.

ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది.

‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్‌ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్‌ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్‌ బాండ్‌ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు