రాహుల్‌ పర్యటనలో మార్పు 

1 Nov, 2023 02:40 IST|Sakshi

నేడు కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లో ప్రచారం 

రేపటి షెడ్యూల్‌ వాయిదా 

నామినేషన్లు ముగిశాక మళ్లీ రాష్ట్రానికి 

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈనెల 1, 2 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నా ఒకరోజు ముందుగానే వచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో జరిగిన పాలమూరు ప్రజాభేరి సభకు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హాజరుకావాల్సి ఉంది.

రాహుల్‌ ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరై బుధవారం మధ్యాహ్నానికి రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ, ప్రియాంకకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రాహుల్‌ సీఈసీ సమావేశాన్ని రద్దు చేసుకుని కొల్లాపూర్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం రాత్రికి హైదరాబాద్‌లో బస చేశారు. బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌ పట్టణాల్లో రాహుల్‌ ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత కల్వకుర్తి సభలో పాల్గొని, ఆ తర్వాత జడ్చర్లలో జరిగే కార్నర్‌ మీటింగ్‌కు హాజరవుతారు.

అక్కడి నుంచి షాద్‌నగర్‌లో పాదయాత్ర చేసి అక్కడ జరిగే కార్నర్‌ మీటింగ్‌కు హాజరవుతారు. తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. కాగా, రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన 2వ తేదీ షెడ్యూల్‌ను రాహుల్‌ వాయిదా వేసుకున్నారు. మూడో తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిశాక మరోమారు రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని గాం«దీభవన్‌ వర్గాలు చెప్పాయి.  

మరిన్ని వార్తలు