కళలతో కోట్లు.. వీరి టర్నోవర్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!

20 Aug, 2023 08:16 IST|Sakshi

రామ్ వి సుతార్‌ తరహాలో గొప్ప పేరు సంపాదించుకున్న శిల్పకారులు మనదేశంలో చాలామంది ఉన్నారు. వీరు విదేశాలలో కూడా పేరు సంపాదించారు. వీరిలో శిల్పి అనీష్ కపూర్ ఒకరు. వీరి కళాఖండాలు విదేశాలలో కూడా విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనీష్ కపూర్ అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ శిల్పకారునిగా గుర్తింపు పొందారు. అతని టర్నోవర్ అతని విజయ గాథను తెలియజేస్తుంది. 

హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం 69 ఏళ్ల అనీష్ కపూర్ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన 50 మంది శిల్పకళా కళాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అనీష్‌ టర్నోవర్  ఏడాదికి రూ. 91 కోట్లుగా ఉందని పలు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పుకునే నటీనటులకు మించి అనీష్‌ ఆదాయం ఉంది.
 
అగ్రస్థానంలో అనీష్‌ కపూర్‌

లండన్‌లో నివసిస్తున్న అనీష్ కపూర్ శిల్ప హస్తకళాకారునిగా సక్సెస్ అయ్యారు. అతని కళాఖండాలలో ఒకటి 9.27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడమే దీనికి ఉదాహరణగా నిలిచింది. ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ల కారణంగా భారత్ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఆర్ట్ జాబితాలో అగ్రస్థానంలో ఉందని తాజా రిపోర్టు తెలియజేస్తోంది. 

జులై 31న విడుదల చేసిన ఈ జాబితాను వేలంలో విక్రయించిన కళాఖండాల ఆధారంగా తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం భారతదేశపు ప్రఖ్యాత పెయింటర్ అర్పితా సింగ్ రూపొందించిన ఒక కళాఖండం 24.71 కోట్ల రూపాయల టర్నోవర్‌తో 11.32 కోట్ల రూపాయలకు విక్రయమయ్యింది. అనీష్ కపూర్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది.

హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం భారతీయ చిత్రకారుడు జోగెన్ చౌదరి మూడవ స్థానంలో ఉన్నారు. కళాకారుడి మొత్తం టర్నోవర్ రూ.19.76 కోట్లు. అతను రూపొందించిన ఏడు అత్యంత ఖరీదైన కళాఖండాలు రూ.4.40 కోట్లకు వేలం వేశారు. అదే విధంగా కళాకారుడు గులాం మహ్మద్ షేక్ టర్నోవర్ రూ.17.88 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

ముంబైకి చెందిన అనీష్ కపూర్ 1972లో బ్రిటన్‌కు వెళ్లారు. అతను చక్కటి కళాఖండాలను రూపొందించడంలో నైపుణ్యం సాధించారు. బ్రిటన్‌లోని టేట్ మోడరన్ టర్బైన్ హాల్‌తో పాటు, చికాగోలోని మిలీనియం పార్క్‌లో కూడా అనిష్ రూపొందించిన శిల్పాలు కనిపిస్తాయి 2018-19 సంవత్సరంలో అనీష్ కపూర్ టర్నోవర్ రూ. 168.25 కోట్లు. 1991 సంవత్సరంలో అనీష్‌కు టర్నర్ ప్రైజ్ లభించింది.
ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!

మరిన్ని వార్తలు