సచిన్‌కు శరద్‌ పవార్‌ చురకలు

7 Feb, 2021 13:02 IST|Sakshi

సాక్షి, ముంబై : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలకు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటంచడం భారత్‌ పెను దుమారాన్ని రేపుతోంది. తమ దేశ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారతీయ ప్రముఖులు కౌటరిస్తున్నారు. పాప్‌సింగర్‌ రిహానా, పర్యవరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌, మియా ఖలీఫాలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం ట్విటర్‌ వేదికగా విదేశీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేశ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, తమ సమస్యలను పరిష్కరించుకునే సత్తా తమకుందని సచిన్‌ కౌంటరిచ్చాడు. అయితే రైతు దీక్షలకు మద్దతు తెలిపిన వారిపై సచిన్‌ ట్వీట్‌ చేయడం పలువురికి ఏమాత్రం నచ్చడంలేదు. సోషల్‌ మీడియా వేదికగా సచిన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రైతు దీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం తీవ్రంగా తప్పుపడుతున్నారు. (సచిన్‌ పోస్ట్‌: ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు)

ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సైతం సచిన్‌ కామెంట్స్‌పై స్పందించారు. ఏదైనా అంశంపై మాట్లాడేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని చాలామంది సెలబ్రిటీల తీరుపై చర్చించుకుంటున్నారని, పూర్తి వివరాలను తెలుసుకుని స్పందిస్తే మంచిదని హితవు పలికారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన శరద్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇదే విషయంపై ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సచిన్‌ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు. సచిన్, లతా మంగేష్కర్‌లు వారివారి వృత్తిలో గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించారని, కానీ, కొద్దిరోజుల కిందట వారు పెట్టిన పోస్టుల కారణంగా సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు