Ayodhya: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు

12 Dec, 2023 08:13 IST|Sakshi

అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనుంది. 

శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు నాలుగు వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు  సమర్పించిన తర్వాత ప్రధాని నరే​ంద్ర మోదీ.. శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. 

అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన సాయుధ బృందం అయోధ్యలో త్వరలో ప్రారంభంకానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రతను అందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పూర్తవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్‌ ఫార్ములా?

>
మరిన్ని వార్తలు