Sikh for Justice: వరల్డ్‌ కప్‌ కాదు.. టెర్రర్‌ కప్‌

30 Sep, 2023 05:24 IST|Sakshi

భారత్‌లో విధ్వంసానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు 

ప్రజల ఫోన్లకు ప్రి–రికార్డెడ్‌ వాయిస్‌ మెసేజ్‌  

హరిదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం 

అక్టోబర్‌ 5న ప్రపంచ టెర్రర్‌ కప్‌ ప్రారంభమవుతుందని హెచ్చరిక   

అహ్మదాబాద్‌: కరడుగట్టిన ఖలిస్తాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూపై గుజరాత్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్‌ ప్రపంచ కప్‌ ‘ప్రపంచ టెర్రర్‌ కప్‌’గా మారతుందంటూ సోషల్‌ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్‌ మెసేజ్‌ను విదేశీ ఫోన్‌ నంబర్‌తో సోషల్‌ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్‌తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్‌ అందిందని పేర్కొన్నారు.

మెసేజ్‌ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌.ఎన్‌.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) కోడ్‌ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్‌ కాల్‌ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్‌ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్‌ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

...ఇట్లు గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూ  
విదేశీ ఫోన్‌ నంబర్‌తో వచి్చన కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ వినిపిస్తోందని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు జీతూ యాదవ్‌ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం.

మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్‌ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్‌ ప్రపంచ కప్‌ కాదు, ప్రపంచ టెర్రర్‌ కప్‌ ప్రారంభమవుతుంది. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ఖలిస్తాన్‌ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్‌ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్‌ వస్తోందన్నారు.

ఎవరీ పన్నూ?  
సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్‌ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూ పంజాబ్‌ రాష్ట్రంలో అమృత్‌సర్‌ సమీపంలోని ఖంజోత్‌ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు.

ఖలిస్తాన్‌ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్‌ చేస్తున్నాడు. హరిదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు