భారత్‌ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక

24 Sep, 2022 05:50 IST|Sakshi

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సాగే భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొననున్నారు. రాహుల్‌ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు కేరళ సరిహద్దులోని గుండ్లుపేట్‌ వద్ద కర్ణాటకలో ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా వేర్వేరుగా పాల్గొంటారని కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ శుక్రవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

కర్ణాటకలో భారత్‌ జోడో యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టే బాధ్యతలను నాయకులకు అప్పగించామని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలాలతో కలిసి సమీక్షించామన్నారు. ఇలా ఉండగా, కేరళలోని చలకుడి వద్ద భారత్‌ జోడో యాత్ర శుక్రవారం విశ్రాంతి కోసం నిలిచిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు. యాత్రికుల కోసం కేటాయించిన కంటెయినర్‌లో రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అక్కడే వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. రాహుల్‌ ఢిల్లీ వెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. 

మరిన్ని వార్తలు