Sudha Murthy: కేరళ పొంగళ వేడుకల్లో సుధామూర్తి.. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు

11 Mar, 2023 18:50 IST|Sakshi

సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్తాపకులు నారాయణమూర్తి భార్య, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అత్తగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విద్యావేత్త, రచయితగా, సామాజిక సేవకురాలిగా అనేక  కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. అంతేగాక ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాలలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం సుధామూర్తిని పద్మభూషన్‌, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. 

అయితే సంపన్న కుటుంబం, వేల కోట్ల ఆస్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న సూధామూర్తి ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించుకోరు. మాటల్లోనూ, చేతల్లోనూ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. తాజాగా మరోసారి ఆమె తన సింస్లిసిటీతో వార్తల్లోకెక్కారు. కేరళ తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ(Pongala) పండుగకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు సుధామూర్తి కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె అనేకమంది మహిళల మధ్య కూర్చొని పొంగళి (బియ్యం,కొబ్బరి, బెల్లంతో చేసే తీపి వంటకం) తయారు చేసి దేవతకు సమర్పించారు. అంతేగాక భక్తులకు ప్రసాదం వడ్డించడంలోనూ సాయం చేశారు. అయితే సుధామూర్తి వద్ద భద్రత, వీఐపీ హడావిడి లేకపోవడంతో తనను ఎవరూ గుర్తించలేకపోయారు. మహిళలందరితోపాటే గుడి వద్ద మండుతున్న ఎండలో కూర్చొని నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఆమె ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త, అల్లుడు గొప్ప స్థానంలో ఉన్నా ఆమెలో ఒకింత కూడా గర్వం నిపించడం లేదని ప్రశంసిస్తున్నారు. కాగా అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి తెలిపారు. ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారని, అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక అని పేర్కొన్నారు. అందరూ సమానమేనన్న ఈ భావన తనకెంతో నచ్చిందన్నారు. 

చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..

మరిన్ని వార్తలు