ఏపీ విభజన చట్టం: షెడ్యూల్ 9, 10 సంస్థలపై పిటిషన్‌.. కేంద్రం, టీఎస్‌కు నోటీసులు

9 Jan, 2023 11:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. 

పిటిషన్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం.. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఈ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా ఉండగా.. దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. 

మరిన్ని వార్తలు