Supreme Court: జేసీబీ కూల్చివేతలను నిషేధించలేం.. ‘కమ్యూనిటీ టార్గెట్‌’ వ్యాఖ్యలను తోసిపుచ్చిన సుప్రీం

13 Jul, 2022 14:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మున్సిపల్‌ అధికారులు చేపట్టిన జేసీబీ అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతలపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్‌ అధికారుల పరిధిలోని అంశమని, ఎవరైనా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందేనని బుధవారం స్పష్టం చేసింది. 

దేశవ్యాప్తంగా జేసీబీ కూల్చివేతలపై నిషేధం విధించాలని.. ప్రత్యేకించి ఇస్లాం కమ్యూనిటీకి చెందిన కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఉలామా-ఐ-హింద్‌ అనే సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. బదులుగా.. కూల్చివేతలు అంతా సర్వసాధారణంగా జరిగే వ్యవహారమని, ఉద్దేశపూర్వక చర్యలు కావని యూపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.  

ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలకు సైతం సుప్రీం కోర్టు బదులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం వాదనల సందర్భంగా.. ప్రత్యేకంగా కమ్యూనిటీ అనే పదాన్ని ప్రస్తావించారు పిటిషనర్లు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, అల్లర్లకు సాకుగా చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ప్రతిగా..

సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ అడ్వొకేట్‌ హరీష్‌ సాల్వేలు ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించారు.. ‘అంతా భారతీయ కమ్యూనిటీలే’ ని వ్యాఖ్యానించారు. అల్లర్లకు, కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని, అవసరంగా సంచలనం చేయాలని చూస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు. ఈ క్రమంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. కూల్చివేతలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు