పల్లెల ప్రగతికి ‘స్వామిత్వ యోజన’

7 Oct, 2021 04:56 IST|Sakshi

భోపాల్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్‌ అబాదీ సర్వే, మ్యాపింగ్‌(స్వామిత్వ) యోజన పల్లెల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ పథకం అమలుతో ప్రజలకు వారి స్థిరాస్తులపై వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపారు. దేశంలో పల్లె సీమల ప్రగతిలో ఇదొక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో స్వామిత్వ యోజనను ప్రారంభించి 10 నెలల పూర్తయిన సందర్భంగా బుధవారం వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

భూ యజమానులకు ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌’
హర్దా జిల్లాలోని కొందరు ‘స్వామిత్వ యోజన’ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. మధ్యప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కమల్‌ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కమల్‌ 2008లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నపుడు హర్దా జిల్లాలో ‘ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్‌ అధికార్‌ పుస్తికా’ పేరిట గ్రామస్థులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఇలాంటి పథకం ఇదే మొదటిది. ఈ యాజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంకుల నుంచి రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. స్వామిత్వ పథకాన్ని ప్రధాని మోదీ 2020 ఏప్రిల్‌లో సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌గా ప్రారంభించారు.

గ్రామ స్వరాజ్య సాధనతోపాటు సామాజిక–ఆరి్థక సాధికారతను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా పల్లె ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్‌ టెక్నాలజీతో భూములను సర్వే చేస్తారు. దీంతో ప్రజలకు స్పష్టమైన భూయాజమాన్య హక్కులు లభిస్తాయి. అంతేకాకుండా లీగల్‌ ఓనర్‌షిప్‌ కార్డులు జారీ చేయడం ద్వారా యజమానులకు ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌’ కల్పిస్తారు. గ్రామాల్లోని భూములను సమగ్రంగా సర్వే చేయడమే స్వామిత్వ పథకం ఉద్దేశం. కేంద్ర, రాష్ట్రాల పంచాయతీరాజ్‌ శాఖలు, సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా డ్రోన్ల సాయంతో సర్వే చేస్తాయి. భూముల హద్దులను తేల్చి, యజమానులకు చట్టబద్ధమైన ప్రాపర్టీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి.

మరిన్ని వార్తలు