58 నిమిషాల్లో46 వంటకాలు.. చిన్నారి రికార్డ్‌

16 Dec, 2020 14:53 IST|Sakshi

సాక్షి, చెన్నై : వంట చేయాలంటే కనీసం 30 నిమిషాలు కేటాయించాల్సిందే. ఇక కొన్ని స్పెషల్‌ వంటకాలకైతే గంటకు పైగా సమయం తీసుకుంటారు. ఆ గంటలో కూడా కేవలం ఒకటి, రెండు రకాల వంటకాలు చేయడమే ఎక్కువ. అలాంటి ఓ చిన్నారి కేవలం 58నిమిషాల్లో 46 రకాల వంటకాలు చేసి యునికో బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఎస్‌ఎన్‌ లక్ష్మి సాయిశ్రీ వంటలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఎక్కువ. తన తల్లి దగ్గర శిక్షణ తీసుకొని వంటలు చేయడం ప్రారంభించింది.

లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కొత్త వంటకాలు చేయడం మొదలుపెట్టింది. వంటకాలు చేయడం పట్ల చిన్నారికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు..ఈ హాబీతో రికార్డు సృష్టించాలని భావించారు. ఈ మేరకు సాయిశ్రీ తండ్రి ఆన్‌లైన్‌లో పరిశోధన చేసి.. కేరళకు చెందిన పదేళ్ల అమ్మాయి శాన్వి సుమారు 30 వంటలు వండినట్లు గుర్తించారు. తన కుమార్తెతో ఆ రికార్డును బద్దలు కొట్టాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి యునికో రికార్డు సాధించారు.  తాను తమిళనాడులోని విభిన్న సాంప్రదాయ వంటలు వండుతానని, లాక్‌డౌన్‌ సమయంలో కుమార్తె తనతోనే వంట గదిలో గడిపేదని, సాయిశ్రీ ఆసక్తిపై తన భర్తతో చర్చించి ప్రపంచ రికార్డ్‌ కోసం ప్రయత్నించామని సాయిశ్రీ తల్లి కలైమగల్‌ తెలిపారు. ప్రపంచ రికార్డును సృష్టించిన చిన్నారి సాయిశ్రీని పలువురు అభినందించారు. 

మరిన్ని వార్తలు