హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌

3 Oct, 2021 03:07 IST|Sakshi

ప్రకటించిన ఏఐసీసీ 

సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగరావును ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఆయన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

బల్మూరి వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్‌ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా... 
2015, 2018లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్‌ చదివిన వెంకట్‌ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్‌ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్‌ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.

ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్‌ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  

అధినాయకత్వానికి ధన్యవాదాలు: వెంకట్‌ 
హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులకు వెంకట్‌ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు