Top 10 Politicians: 2023లో రాజకీయాలన్నీ వీరి చుట్టూనే!

23 Dec, 2023 09:11 IST|Sakshi

కొత్త సంవత్సరం 2024 కొద్దిరోజుల్లో ప్రవేశించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరి చేతికి నాయకత్వాన్ని అప్పగిస్తారో వేచి చూడాలి. అయితే 2023లో దేశంలోని ఏ నేతలు ముఖ్యాంశాలలో కనిపించారో.. వారిలో ఆ ‘పదుగురు’ నేతలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జీ-20 సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో మోదీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ ఏడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. దీనికి ప్రధాని మోదీ ప్రజాకర్షక నాయకత్వమే కారణమని బీజేపీ చెబుతోంది. మార్నింగ్ కన్సల్ట్ అప్రూవల్‌ రేటింగ్‌లో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భారత పర్యటనను జనవరి 2023లో ముగించారు. సెప్టెంబరు 2022లో ప్రారంభమైన రాహుల్‌ పాదయాత్ర శ్రీనగర్‌లో ముగిసింది. ఈ పర్యటన అనుభవాన్ని రాహుల్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో  అందరితో పంచుకున్నారు.  మరోవైపు రాహుల్ ఈ ఏడాది పార్లమెంటు సభ్యత్వాన్ని. కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత కోర్టు నుండి ఉపశమనం పొందారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ఓటమిపాలు కాగా, తెలంగాణలో విజయం సాధించింది.

నితీష్ కుమార్
2005 నుంచి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ఈ ఏడాది కూడా హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఒక్కోసారి ఎన్డీఏ, మరికొన్నిసార్లు మహాకూటమి.. ఎప్పటికప్పుడు మిత్రపక్షంగా మారుతుండటంతో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతింటోంది. నితీష్ కుమార్.. బీహార్‌లో కుల గణన నిర్వహించి చర్చల్లో నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కులగణన దిశగా ఆలోచించేలా చేశారు. 

యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. 2023 ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య అసెంబ్లీలో  చర్చకు వచ్చింది. ఉమేష్ పాల్ హత్య కేసులో మాఫియా అతిక్ అహ్మద్ పేరు బయటకు వచ్చింది. ఈ మాఫియాను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో  హామీనిచ్చారు. ఈ క్రమంలో యోగి ప్రభుత్వం అతిక్, అతని అనుచరులపై ఉచ్చు బిగించింది. ఉమేష్ పాల్ హత్యకేసులో ప్రమేయం ఉన్న అతిక్ కుమారుడు పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. ఆ తర్వాత అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ కూడా వైద్య పరీక్షల కోసం పోలీసు కస్టడీలో ఉండగా కాల్పులకు బలయ్యారు. 

అజిత్ పవార్
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అజిత్ పవార్ తన రాజకీయ గురువు, మామ అయిన శరద్‌ పవార్‌పై తిరుగుబాటు చేసి, ఎన్‌డీఏలో చేరి మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతే కాదు ఎన్సీపీ పార్టీపై కేసు వేశారు. 2019లో కూడా అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభించలేదు.

మహువా మోయిత్రా
ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు స్వీకరించి, పార్లమెంటు వెబ్‌సైట్  యూజర్ ఐడి,పాస్‌వర్డ్‌ను అతనితో పంచుకున్నందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా డిసెంబర్ 8న లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు మేరకు ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. ఆమె ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వం ప్రారంభించిన లాడ్లీ లక్ష్మి పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. రాష్ట్ర నాయకత్వాన్ని కొత్త వ్యక్తికి అప్పగించాలని పార్టీ నిర్ణయించడంతో శివరాజ్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.

మోహన్ యాదవ్
మోహన్ యాదవ్ గతంలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బంపర్ విజయం సాధించడంతో మోహన్ యాదవ్ శాసనసభా పక్ష సమావేశంలో నాయకునిగా ఎన్నికయ్యారు. శివరాజ్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

భజన్‌లాల్ శర్మ
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశం తర్వాత భజన్‌లాల్ శర్మ పేరు అంతటా మారుమోగింది. ఆ సమావేశంలో ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలువురు సీనియర్ నేతల సమక్షంలో పార్టీ ఆయనను సీఎంగా ఎన్నుకుంది. డిసెంబర్ 15న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

విష్ణుదేవ్ సాయి
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. విష్ణుదేవ్ సాయిని సీఎం చేసింది. శాసనసభా పక్ష సమావేశంలో ఆయనను నాయకునిగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ సాయి గిరిజన నేతగా గుర్తింపు పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు అధికంగా ఉన్నారు. అందుకే విష్ణుదేవ్ సాయిని బీజేపీ.. సీఎంగా ఎన్నిక చేసింది.
ఇది కూడా చదవండి: టాప్‌-5 డైట్‌ ప్లాన్స్‌... 2023లో ఇలా బరువు తగ్గారట!

>
మరిన్ని వార్తలు