లైంగిక వేధింపులు.. ఆన్‌లైన్‌ క్లాస్‌లో టవల్‌తో టీచర్‌

24 May, 2021 20:42 IST|Sakshi

తమిళనాడులో వెలుగు చూసిన సంఘటన

నీలి చిత్రాలు, అసభ్య సందేశాలతో విద్యార్థినులను వేధిస్తున్న టీచర్‌

సస్పెండ్‌ చేయాల్సిందిగా సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌

చెన్నై: మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఉంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి.. జీవితంలో వారు ఉన్నత స్థానానికి చేరడానికి దోహదపడతాడు. అయితే నేటి తరం గురువుల్లో కొందరు గురవింద గింజలుంటున్నారు. పాఠాలు చెప్పే వంకతో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. కీచకులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ టీచర్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితులు సదరు టీచర్‌ అరాచకాల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. 

ఆ వివరాలు.. తమిళనాడు రాజధాని చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్(పీఎస్‌బీబీ) స్కూల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్‌ కేకే నగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న రాజగోపాలన్ అనే ఉపాధ్యాయుడు.. అకౌంటన్సీ అండ్ బిజినెస్ స్టడీస్ సబ్జెక్ట్స్‌ బోధిస్తుంటాడు. పాఠాలు చెప్పే సమయంలో చేసే రాజగోపాలన్‌ తమను తప్పుడు దృష్టితో చూస్తున్నాడని ఆ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు రాజేంద్రన్‌ అకృత్యాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

పీఎస్‌బీబీ స్కూల్ పూర్వ విద్యార్థులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రాజగోపాలన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డీన్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఈ విషయంపై విచారణ జరపాలని కోరారు. స్కూల్‌లో క్లాసులు జరిగే సమయంలో.. రాజగోపాలన్‌ అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవాడని పూర్వవిద్యార్థులు వారి లేఖలో పేర్కొన్నారు. అమ్మాయిలను అనుచితంగా తాకడంతో పాటు.. లైంగిక పరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. అలాగే క్లాస్‌లో అందరి ముందు విద్యార్థినిలపై లైంగికపరమైన కామెంట్స్ చేసేవాడని తెలిపారు. శరీరాకృతి గురించి మాట్లాడేవాడని చెప్పారు. స్లీవ్ లెస్ దస్తులు ధరించిన విద్యార్థినులను పొగిడేవాడని లేఖలో వెల్లడించారు.

లాక్‌డౌన్ కాలంలో జరిగిన ఆన్‌లైన్ క్లాసులకు రాజగోపాలన్ ఒక టవల్ మాత్రమే ధరించి హాజరైనట్టు పూర్వ విద్యార్థులు ఆరోపించారు. అలాగే విద్యార్థినిలకు మెసేజ్‌లు చేయడంతోపాటు.. వారి వాట్సప్ ప్రొఫైల్ ఫొటోలపై కామెంట్స్ చేసేవాడని అన్నారు. కొందరికి ఫొటోలు అందంగా ఉన్నాయంటూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ పంపాడని చెప్పారు. ఓ విద్యార్థినిని తనతో పాటు సినిమాకు రావాల్సిందిగా కోరాడని తెలిపారు.

ఇక, రాజగోపాలన్ గురించి మేనేజ్‌మెంట్‌కు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు ఈ అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చెన్నైలోని పీఎస్‌బీబీ స్కూల్‌లో ఓ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరపాలని, ఇందులో ప్రమేయం ఉన్న పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని నేను హామీ ఇస్తున్నాను’అని కనిమొళి తెలిపారు.

చదవండి: కీచక టీచర్‌, విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు..

మరిన్ని వార్తలు