ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్న జనం.. ఎందుకంటే!

11 Nov, 2022 19:41 IST|Sakshi

ప్రజా రవాణా వ్యవస్థ పట్ల నగర వాసులకు ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వేళాపాళలేకుండా రావడం, గంటలకొద్దీ వేచి చూడడం, ప్రయాణం ఆలస్యం కావడం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర వాసులు ప్రజా రవాణాకు దూరమవుతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 46 నగరాల్లో 2 లక్షల మంది పైగా తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తపరిచారు. 15 వేల మంది పైగా బస్సు డైవర్లు, కండక్టర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. 


రద్దీ ఎక్కువ.. నమ్మకం లేదు

విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి భయపడుతున్నామని 68 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళితే సమయానికి గమ్యస్థానానికి చేరతామన్న నమ్మకం లేదని 64 శాతం మంది చెప్పారు. భద్రత పట్ల 36 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని 27 శాతం మంది ఫిర్యాదు చేశారు. 


ఆన్‌లైన్‌ చేయాలి

ప్రజా రవాణా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలని జనం కోరుకుంటున్నారు. బస్సులు ఏయే మార్గాల్లో, ఏ సమయంలో వెళుతున్నాయి.. ఎక్కెడెక్కడ ఆగుతాయనే సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని 57 శాతం మంది కోరుకున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారిలో 54 శాతం మంది ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగిల్‌ జర్నీ చేసే వారిలో 53 శాతం మంది నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లలో ఎక్కువ శాతం క్యాష్‌ పేమెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. 


ట్రాఫిక్‌ జామ్‌లతో తంటా

నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌లతో సతమతమవుతున్నామని 59 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. ట్రాఫిక్‌ కారణంగానే సమయానుకూలంగా బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు. ఇక బస్సు సిబ్బందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 50 శాతం మంది రోగాల బారిన పడుతున్నారు. 34 శాతం మంది బస్సు డ్రైవర్లకు బీమా భద్రత లేదు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లలో 45 శాతం మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒత్తిడి, ఆందోళన, కీళ్లు-ఒళ్లు నొప్పులు ఎక్కువగా వేధించే సమస్యలని వెల్లడించారు. 


సర్వే ఎందుకంటే..

స్మార్ట్‌ సిటీ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ‘ట్రాన్స్‌ఫోర్ట్‌ ఫర్‌ ఆల్‌ చాలెంజ్‌’ పేరుతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ సర్వే చేపట్టింది. 2021 అక్టోబర్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకు సర్వే నిర్వహించింది. ప్రజా రవాణా వ్యవస్థలో సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ఇదంతా చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సమాచారం సేకరించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రెండో దశలో ప్రయత్నాలు చేస్తామన్నారు. అంకుర సంస్థలు ఏమైనా పరిష్కారాలు ఉంటే స్టార్టప్‌ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. (క్లిక్‌: కేపీహెచ్‌బీ టూ ఓఆర్‌ఆర్‌.. మెట్రో నియో పట్టాలెక్కేనా!)

మరిన్ని వార్తలు