కాంగ్రెస్‌ నేతపై దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక

20 Jun, 2022 10:37 IST|Sakshi

ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. 

వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్‌ బర్మాన్‌.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్‌నగర్‌లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్‌ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్‌ రాయ్‌.. భద్రతా సిబ్బంది, డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. 

ఇదిలా ఉండగా.. సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్‌ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్‌ బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్‌

మరిన్ని వార్తలు