వారంతే..! యథేచ్ఛగా కబ్జాల పర్వం

20 Jun, 2022 10:31 IST|Sakshi

గంట్యాడ: అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, అధికారం కోల్పోయినప్పటికీ వారి తీరు కొనసాగిస్తూ కబ్జాల కు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు కనిపిస్తే వదలడం లేదు. ఆక్రమించిన భూముల్లో సాగు చేపట్టడంతో పాటు, షెడ్డులు కూడా నిర్మిస్తున్నారు. చర్యలు చేపట్టాల్సి న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

గ్రామకంఠం ఆక్రమణ   
గంట్యాడ మండలంలోని గొడియాడ గ్రామంలో టీడీపీ నేతలు గ్రామకంఠంలో ఉన్న భూమిని ఆక్రమించి ఆ స్థలంలో మామిడి మొక్కలు  వేశారు. అంతేకాకుండా షెడ్డు నిర్మించారు. ఆక్రమిత స్థలం చుట్టూ గ్రీన్‌ మేట్‌తో కంచె వేశారు. ఆ స్థలంలో  వ్యవసాయ గొడౌన్‌ నిర్మించాలని వ్యవసాయ అధి కారులు నిర్ణయించారు. అయితే ఈ స్థలం ఆక్రమణలో ఉండడంతో గొడౌన్‌ నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న దానిపై తర్జన, భర్జన పడుతున్నారు. సుమారు ఎకరం స్థలం వరకు భూమి ఆక్రమణ కు గురైంది. దీని విలువ సుమారు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది.  

సీసీ రోడ్డుపైనే షెడ్డు నిర్మాణం  
గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత ఏకంగా సీసీ రోడ్డును నివాసయోగ్యంగా మార్చేశాడు. సీసీ రోడ్డుపై షెడ్డు వేశాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సీసీ రోడ్డుపై శాశ్వత నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నోటీసులు సిద్ధం  చేశాం  
గ్రామ కంఠంలో  భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు సిద్ధం చేశాం. సోమవారం నోటీసులు ఇస్తాం. సీసీ రోడ్డుపై షెడ్డు వేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. రెండు, మూడు రోజుల్లో ఖాళీ చేయిస్తాం.  
–అజయ్, వీఆర్వో, గొడియాడ 

విచారణ ప్రారంభం  
గొడియాడలో భూమిని ఆక్రమించినట్లు స్పందన కార్యక్రమంలో  గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ ప్రారంభించాం. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణపై ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటాం. 
– ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ  

మరిన్ని వార్తలు