సొరంగం కుప్పకూలిన ఘటన.. డ్రిల్లింగ్‌ పనుల్లో అంతరాయం

15 Nov, 2023 07:58 IST|Sakshi
టన్నెల్‌ కూలిన ప్రాంతంలో రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బంది

టన్నెల్‌లో ఉన్న తండ్రితో మాట్లాడిన కొడుకు 

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌ మార్గంలో సొరంగం కుప్పకూలి 60 గంటలకు పైగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనుల్లో మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. కుప్పకూలిన టన్నెల శిథిలాల గుండా ఆగర్‌ మెషీన్‌ సాయంతో వెడల్పాటి స్టీల్‌ పైపులను లోపలికి పంపే పనులు మంగళవారం మొదలైనట్లు తెలిపారు.

డ్రిల్లింగ్‌ పరికరాలను ఉపయోగించి 800, 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అన్నీ సజావుగా సాగితే బుధవారాని కల్లా అందరినీ వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్‌ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పనులకు మాత్రం అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.


ఎటువంటి అపాయం లేదు 
సొరంగం లోపల చిక్కుకున్న కారి్మకులకు ఆక్సిజన్, మంచి నీరు, టీ, ఆహారం ప్యాకెట్లు, మందులను ట్యూబుల ద్వారా లోపలికి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. కార్మికులు 400 మీటర్ల వెడల్పుండే బఫర్‌ జోన్‌లో చిక్కుబడి పోయారన్నారు. వారు తేలిగ్గా, నడవొచ్చు, గాలి పీల్చుకోవచ్చు అని వివరించారు. అందరూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారన్నారు. ఛార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మఖాల్‌–యమునోత్రి జాతీయ రహదారిలో సిల్‌క్యారా– దండల్‌గావ్‌ మధ్య నిర్మిస్తున్న సొరంగం ఆదివారం ఉదయం సిల్‌క్యారా వైపు కూలిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుబడిన వారిలో బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులున్నారు.

ధైర్యంగా ఉండండి 
టన్నెల్‌లో చిక్కుబడిపోయిన 40 మందిలో ఒకరైన ఉత్తరాఖండ్‌కు చెందిన కార్మికుడితో ఆయన కుమారుడు కొద్ది సెకన్ల పాటు మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదని, తనతోపాటు ఉన్న తోటి వారికి కూడా ధైర్యం చెబుతున్నానని అతడు పేర్కొన్నాడు. సొరంగం కుప్పకూలడంతో ఆదివారం ఉదయం నుంచి లోపలే ఉండిపోయిన 40 మందిలో ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్‌కు చెందిన గబ్బర్‌ సింగ్‌ నేగి కూడా ఉన్నారు. నేగి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఘటనా స్థలి వద్దకు మంగళవారం ఉదయం నేగి కొడుకు ఆకాశ్, అన్న మహరాజ్‌ చేరుకున్నాడు.

అధికారులు పైపు ద్వారా ఆకాశ్‌కు తండ్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. తమకు ఆక్సిజన్‌ అందుతోందని, భయపడొద్దని కుమారుడికి నేగి ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్లకి కూడా ఇదే విషయం చెప్పాలని కోరారు. ‘సొరంగం కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మాకు చాలినంత ఆహారం, నీరు అందుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సురక్షితంగా బయటకు వచ్చేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారు’అని కూడా నేగి తన కుమారుడికి తెలిపారు.    

మరిన్ని వార్తలు