అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్‌’ ముప్పు

5 May, 2021 13:56 IST|Sakshi

ఆండ్రాయిడ్‌ ఫోన్లను అటాక్‌ చేస్తున్న మాల్‌ వేర్‌

కొరియర్‌ డెలివరీ అప్‌డేట్‌ రూపంలో మెసేజీలు

ఫోన్లలోని అన్ని పాస్‌వర్డ్స్‌ తస్కరిస్తున్న ఈ వైరస్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ పార్శిల్‌ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్‌ తెలియాలంటే ఈ లింకును క్లిక్‌ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్‌ సంస్థ పేరుతో మీ ఫోన్‌కు సందేశం వచ్చిందనుకోండి. నిజంగా పార్శిల్‌ రావాల్సిన వాళ్లు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి.. ఆర్డర్లు ఇవ్వని వాళ్లు పార్శిల్‌ ఏంటనే ఉత్సుకతతో లింకును ఓపెన్‌ చేస్తారు. సైబర్‌ నేరగాళ్లు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ’ఫ్లూబోట్‌’ మాల్‌వేర్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్ల పైకి వదులుతున్నారు. ఇప్పటికే లండన్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్‌లో అనేక మంది దీని బారినపడ్డారని, భారత్‌కూ ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై లండన్‌కు చెందిన నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ (ఎన్‌సీఎస్‌సీ) అలర్ట్‌ జారీ చేసింది. 

ఆన్‌లైన్‌కు డిమాండ్‌ పెరగడంతో..
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో అనేక మంది నేరుగా షాపింగ్‌ చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ కు డిమాండ్‌ పెరిగింది. దేశీయ వెబ్‌ సైట్లు, యాప్‌లతో పాటు విదేశాలకు చెందిన వాటిల్లోనూ ఖరీదు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అనేక అంతర్జాతీయ విమానాలు, కంటైనర్లను తీసుకొచ్చే కార్గో లైనర్లు రద్దయ్యాయి. ఈ కారణంగా అంతర్జాతీయ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సైబర్‌ నేరగాళ్లు కొరియర్‌ సంస్థల పేరుతో డెలివరీ ట్రాకింగ్‌ అంటూ ఫ్లూబోట్‌ మాల్‌వేర్‌ను పంపిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ఆ సందేశంలో వచ్చిన లింకును క్లిక్‌ చేసిన మరుక్షణం ఆ మాల్‌వేర్‌ ఫోన్‌లో నిక్షిప్తమైపోతుంది. ఈ మెసేజీలను సైబర్‌ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ల ద్వారా బల్క్‌ విధానంలో పంపిస్తారు. ఫలితంగా వాళ్లు ఎక్కడ నుంచి పంపారు.. ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం సాధ్యపడదు. 

అన్ని పాస్‌వర్డ్స్‌ వారి అధీనంలోకి..
ఇటీవల ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యాప్‌ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్స్‌.. ఇలా ప్రతి ఒక్కటీ ఫోన్‌ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ-మెయిల్, ట్విట్టర్‌ తదితర సోషల్‌మీడియాలను మొబైల్‌ లోనే వాడుతున్నారు. ప్రతి స్మార్ట్‌ ఫోన్‌కు పిన్, పాస్‌వర్డ్, ఫింగర్‌ ప్రింట్, ఫేషియల్‌ విధానాల్లో లాక్‌లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో నిక్షిప్తమై ఉండే ఫ్లూబోట్‌ వైరస్‌ ఈ పాస్‌వర్డ్స్‌ను సంగ్రహిస్తుంది. ఆ డేటా మొత్తాన్ని మాల్‌వేర్‌ ప్రయోగించిన సైబర్‌ నేరగాడికి అందిస్తుంది. దీన్ని దుండగులు దుర్వినియోగం చేస్తుండటంతో వ్యక్తిగత డేటాతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తోంది. ఒకసారి ఫోన్‌లోకి ప్రవేశించిన ఫ్లూబోట్‌ అంత తేలిగ్గా పోదని, ఇది ఫోన్‌లో నిక్షిప్తమైనట్లు గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఫార్మాట్‌ చేస్తేనే వైరస్‌ తొలుగుతుంది.

అపరిచిత లింకులు క్లిక్‌ చేయొద్దు..
వివిధ రకాలైన వైరస్‌లు, మాల్‌వేర్స్‌ను సైబర్‌ నేరగాళ్లు లింకులు, ఆకర్షణీయమైన ఫొటోల రూపంలో పంపిస్తారు. ఆయా వ్యక్తుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు, ఉత్సుకత కలిగించేలా తయారు చేసిన సందేశాలు, ఫొటోల లింకుల్లో మాల్‌వేర్‌ను నిక్షిప్తం చేస్తారు. సైబర్‌ నేరగాళ్లు కొన్ని రకాలైన వైరస్‌లను ఫోన్లను హ్యాక్‌ చేసి లబ్ధి పొందడానికి వినియోగిస్తారు. మరికొన్నింటిని తమ ఉనికి చాటుకోవడానికి, ఏజెన్సీలకు సవాళ్లు విసరడానికి, వినియోగదారుల ఫోన్లు క్రాష్‌ చేయడానికి ప్రయోగిస్తారు. వీటిలో ఏ తరహా మాల్‌వేర్‌తో అయినా సాధారణ ప్రజలకు ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్లు, సందేశాలతో వచ్చే లింకులను క్లిక్‌ చేయకుండా డిలీట్‌ చేయడం ఉత్తమం.

- సైబర్‌ క్రైం నిపుణులు

మరిన్ని వార్తలు