బిహార్‌లో కూలిన తీగల వంతెన

5 Jun, 2023 05:59 IST|Sakshi
వంతెన కూలిపోతున్న దృశ్యాలు

నిర్మాణంలో ఉండగానే ఈదురుగాలులకు పగుళ్లు 

పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్‌ రాష్ట్రం భాగల్పూర్‌ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్‌ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు.

రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్‌ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్‌ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు