ఏపీలో వలంటీర్ల విశేష కృషికి ధన్యవాదాలు

25 Mar, 2021 04:57 IST|Sakshi

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన విశేష కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ వలంటీర్ల వ్యవస్థ కృషిని ప్రస్తావించారు. భవిష్యత్తు ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఇదే సరైన సమయమని డాక్టర్‌ బీవీ సత్యవతి చేసిన సూచన బాగుందన్నారు. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ఏపీలో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తు వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

దిశ చట్టం కార్యరూపం దాల్చేలా చూడాలి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం కార్యరూపం దాల్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగ గీత కేంద్రాన్ని కోరారు. జువైనల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) అమెండ్‌మెంట్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఓ దుర్ఘటన నేపథ్యంలో ఓ సోదరుడిగా స్పందించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ బిల్లుకు రూపకల్పన చేశారని చెప్పారు. గర్భిణులకు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా అంగన్‌వాడీ సెంటర్లలో తరగతులు బోధించేందుకు సైకాలజిస్టులను అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం ఈ చర్చకు సమాధానమిచ్చిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ సైకాలజిస్టుల ద్వారా గర్భిణులు, పిల్లలకు శిక్షణ ఇప్పించాలని వంగ గీత చేసిన సూచనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

తెలుగువారి ఆత్మగౌరవం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరికాదు
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్‌ సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ప్లాంట్‌ను నష్టాల నుంచి తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.  

మరిన్ని వార్తలు