24 వారాలకు అబార్షన్‌

23 Jul, 2022 03:30 IST|Sakshi

అనుమతించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్‌ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చిత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్‌ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్‌కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ కొట్టివేశారు.

అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌–1971కు విరుద్ధమని పేర్కొంది.

మరిన్ని వార్తలు