బుజ్జాయి ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా..

29 Nov, 2021 17:38 IST|Sakshi

సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు.  చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు..  కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్‌ కర్నేవాలోకీ హార్‌ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్‌ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది.

మంచంపైన కొన్ని దిండులు, బెడ్‌షీట్‌లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్‌షిట్‌ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్‌షిట్‌ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది.

ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్‌ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని  నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది.

చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్‌.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్‌లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు